గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి విధి-విధానాలు
- ఆంధ్రప్రదేశ్‌లో 1.30లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సమర్ధులు, ప్రతిభావంతులనే ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోయే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూలై 19న జరిగిన కేబినెట్ సమావేశంలో అభ్యర్థుల విధులు, అర్హతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, దాదాపు 1.30లక్షల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నియామకాలు జరగనుండగా.. 2.80లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా పనిచేసే వలంటీర్లను నియమిస్తారు.
- గ్రామ సచివాలయ ఉద్యోగాలకు తొలుత ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే, భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా కంప్యూటర్ల ఏర్పాటులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
- ఈ కారణంతో రాత పరీక్ష నిర్వహణకే అధికారులు మొగ్గు చూపారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షకు ఇంటర్మీడియట్, ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించే అధికారుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.
11,114 గ్రామ సచివాలయాలు...కొత్తగా 91,652 ఉద్యోగాలు:
- గ్రామ పంచాయతీలను ‘స్థానిక ప్రభుత్వాలు’గా తీర్చిదిద్దే దిశగా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు బదలాయించబడిన 29 రకాల అధికారాలను సదరు పంచాయతీలే సమర్థవంతంగా నిర్వహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది.
- అక్టోబర్ 2వ తేదీ నుంచి ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు.. ప్రస్తుతం పంచాయతీ స్థాయిలో పనిచేస్తున్న వారు కాకుండా కొత్తగా 91,652 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు, సచివాలయాల నిర్వహణకు సంబంధించి విధి విధానాలను కూడా ఆ ఉత్తర్వుల్లో వివరించారు.
- ప్రతి పంచాయతీ ఇక స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వమే :
- నూతనంగా వ్యవస్థలో గ్రామ పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మారుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించే గ్రామ వలంటీర్లు గ్రామ సచివాలయాల పరిధిలోకి వస్తారని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
- సచివాలయ కన్వీనర్ పంచాయతీ కార్యదర్శి :
- గ్రామ సచివాలయాలలో పనిచేసే ఉద్యోగులందరికీ గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనాభా సంఖ్య ఆధారంగా కొన్నిచోట్ల రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఒక గ్రామ సచివాలయం యూనిట్‌గా గ్రామ కార్యదర్శి, అతనికి అనుబంధ సిబ్బంది పనిచేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు.
రెండేళ్ల పాటురూ.15 వేలు జీతం.. తర్వాత రెగ్యులరైజేషన్
- గ్రామ సచివాలయాల్లో పని చేయడానికి ప్రభుత్వం కొత్తగా నియమించే ఉద్యోగులకు మొదటి రెండేళ్ల పాటు ప్రొబెషనరీ పీరియడ్‌గా భావించి, ఆ కాలంలో నెలకు రూ.15 వేల చొప్పున స్టైఫండ్ రూపంలో వేతనంగా చెల్లిస్తారు.
- రెండేళ్ల తర్వాత వివిధ శాఖల నిబంధనల మేరకు వారిని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరును సమీక్షించడానికి మండల, జిల్లా స్థాయి అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంటుంది.
- ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షణకు ప్రత్యేక మాడ్యూల్‌ను తయారు చేయనున్నట్టు పేర్కొన్నారు.
గ్రామ సచివాలయాల్లో పరీక్ష ఇలా...
- గ్రామ సచివాలయాల్లో నియామకాల సంబంధించిన రాత పరీక్షను 150 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్, ఓఎంఆర్ విధానంలో జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది.
- ఇందులో 75 మార్కులకు జనరల్ నాలెడ్జి ప్రశ్నలు.
- మిగిలిన 75 మార్కులకు సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉండేలా ఆలోచిస్తున్నారు. నియామకాల్లో అభ్యర్థుల స్థానికతను పరిగణనలోకి తీసుకుంటారు.
- అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య వయోపరిమితి విధించాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ పోస్టును బట్టి అది మారే అవకాశం ఉంది.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు వికలాంగులకు గరిష్ట వయో పరిమితిలో మినహాయింపులు ఇవ్వాలని భావిస్తున్నారు.